తమకు కేటాయించాల్సిన సీట్ల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన తెదేపా అధినేత చంద్రబాబుకు కరాఖండిగా తేల్చి చెప్పినట్టు సమాచారం. మంగళవారం జరిగిన మహాకూటమి సమావేశానికి హాజరు కాకుండా అలిగి కూర్చొన్న రాఘవులుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు.
సమావేశానికి హాజరైతే అన్ని సమస్యలూ పరిష్కరించుకుందామని బాబు సూచించారు. అయితే, ముందుగా సీట్ల విషయం తేల్చితేనే సమావేశానికి హాజరవుతానని రాఘవులు స్పష్టం చేశారు. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు.. రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించేలా, కేంద్ర నాయకత్వాన్ని శరణు కోరారు.
18 అసెంబ్లీ సీట్లును సీపీఎం డిమాండ్ చేయగా, 16 సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించారు. అయితే, సోమవారం రాత్రి అకస్మాత్తుగా మీడియా సమావేశం పెట్టి మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయిందని ఏకపక్షంగా ప్రకటించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తప్పు పట్టారు.
అంతేకాకుండా 14 స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఎం అంగీకరించిందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై రాఘవులుతో సహా ఆ పార్టీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, మంగళవారం జరిగే మహాకూటమి సమావేశానికి హాజరుకావడం లేదని ప్రకటించారు. అలానే వారు సమావేశానికి హాజరుకాలేదు. |