ఇండస్ట్రీలో క్రమశిక్షణతోపాటు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా మోహన్ బాబును పేర్కొంటారు. ఆయన ఏది చేసినా మాట్లాడినా అందరూ ఆసక్తిగా వింటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ రాజకీయ వేడి రాజుకున్న సందర్భంగా ఆయన్ని ఏమి అడిగినా చెప్పీచెప్పనట్లుగానే స్పందిస్తుంటారు.
ఇక రోజుకో పార్టీ తమదైన శైలిలో ప్రజలకు అవీ, ఇవీ ఇస్తామంటూ ప్రకటించడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ వ్యంగ్య బాణాలను సంధిస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే...
ప్రజలంటే ఒక్కో పార్టీకి ఎంత అభిమానమో. నాకే ఒళ్లు పులకరిస్తుంది. కుప్పలు తెప్పలుగా ఏవిబడితే అవి హామీలుగా ఇచ్చేస్తున్నారు. టీవీ ఇస్తాం, ఫ్రిజ్ ఇస్తాం, గ్యాస్ ఇస్తాం... రేపు అన్నం కూడా నోట్లో తినిపిస్తాం... అన్నా ఆశ్చర్య పోనక్కరలేదు.
ప్రజలను కష్టపడకుండా సోంబేరుల్లా తయారు చేయాలనుకుంటున్నారు వీరంతా. ప్రజలు కష్టపడితే చూడలేరు పాపం. అందుకే అబ్దుల్ కలాం గారి మాటలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ప్రజలను చైతన్యవంతులను చేయండి అన్నారు. ఆయన చెప్పినట్లు చేస్తేనే సమాజం బాగుపడుతుంది.