రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 22 లోక్‌సభ, 154 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2869 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్లలో 885 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
అధికారుల వివరాల ప్రకారం మొదటి విడత ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2493 నామినేషన్లు చెల్లుబాటు కాగా, లోక్‌సభ స్థానాలకు సంబంధించి 376 నామినేషన్లు చెల్లుబాటయ్యయాని అధికారులు వెల్లడించారు.
ఇక చెల్లుబాటు కాని నామినేషన్లలో హైదరాబాద్ జిల్లా మొత్తం 287 నామినేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. వివిధ కారణాల రీత్యా హైదరాబాద్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 26 నామినేషన్లు తిరస్కరణకు గురికావడం విశేషం.
ఈ నేఫథ్యంలో నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో అధికారులు ఆమోదించిన నామినేషన్ల సంఖ్యలోనూ కాస్త తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. వివిధ పార్టీల రెబల్స్‌గా బరిలో దిగిన అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ ఆయా పార్టీలు ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి నిమిషంలో కొంతమంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.