వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > ఐదున ప్రజారాజ్యం మేనిఫెస్టో: చిరంజీవి
వార్తలు
ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రణాళికను ఈనెల ఐదో తేదీన విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కె.చిరంజీవి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చిరంజీవి స్పష్టం చేశారు. మహాకూటమి సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక అష్టకష్టాలు పడుతోందన్నారు. ఆ కూటమి పార్టీల మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి రాలేదని, అలాంటి కూటమి పీఆర్పీకి పోటీ కానేకాదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మహాకూటమి అంటూ ఒకటుందని తాము భావించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టకట్టడం ఖాయమని చిరు విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ టిక్కెట్లు దక్కలేదన్న అసంతృప్తితో రెబెల్స్‌గా మారిన అభ్యర్థులకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

పార్టీకి ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతికాదని, తిరుగుబాటు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అటువంటి వారికి మున్ముందు తగిన గుర్తింపునిస్తామని చెప్పారు.