అధికార కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మల్లికాబేగంకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆమె పార్టీ కార్యాలయానికి వెళ్లగా అసమ్మతి కాంగ్రెస్ కార్యకర్తలు తరిమికొట్టారు. అస్మదీయుల దాడితో ఆమె భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. గురువారం ఉదయం విజయవాడ పాతబస్తీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో విజయవాడ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి.
స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ వర్గీయురాలైన మల్లికాబేగం అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ మల్లికాబేగంకు లగడపాటి విజయవాడ తూర్పు అసెంబ్లీ టిక్కెట్‌ను ఇప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికాబేగం గురువారం ఉదయం పాతబస్తీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు.
అప్పటికే అక్కడున్న అసమ్మతి కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను కార్యాలయంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు. దీనితో మల్లికాబేగం, అసమ్మతి వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అసమ్మతీయులు మల్లికాబేగంపై దాడి చేయి చేసుకునేందుకు యత్నించారు. ఫలితంగా ఆమె ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి.