రాష్ట్రంలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. విశాఖపట్నం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల (తెలుగుదేశం)పై విజయం సాధించారు. అయితే, ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మహాకూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన తెదేపా అభ్యర్థి పి.నాగేశ్వరరావు, నిజామాబాద్ నియోజకవర్గం నుంచి అరిగెల నర్సారెడ్డిలు కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. అదీ కేవలం ఒకేఒక్క ఓటు తేడాతో వీరు గెలుపొందారు.
వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా మురళి 196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, విశాఖపట్నంలో సూర్యనారాయణ రాజు 127 ఓట్లతోనూ, నల్గొండలో నేతి విద్యాసాగర్ 81 ఓట్ల తేడాతో గెలుపొందారు. మెదక్ నుంచి వి.భూపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే, మహాకూటమి నేతల అభ్యంతరం కారణంగా ఈ ఫలితాన్ని అధికారి జిల్లా కలెక్టర్ ప్రకటించలేదు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా జగదీశ్వర్ రెడ్డి గెలుపొందారు. కాగా ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి పి.నాగేశ్వరరావు 119 ఓట్ల మెజారిటీ గెలిచారు. నిజామాబాద్ నుంచి మహాకూటమి బలపర్చిన తెదేపా అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలిచారు.