తెలంగాణ విషయంలో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే తెలంగాణ సిద్ధిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తాము ఏర్పాటు చేసిన మహాకూటమి అంటేనే కాంగ్రెస్ ఓటమి అంటూ ఆయన ఆవేశంగా నినదించారు. గోదావరిఖనిలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ బహిరంగసభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు.
తెలంగాణ ఇస్తామని చెబితే 2004లో కాంగ్రెస్‌ను నమ్మామని చెప్పిన ఆయన ఆ విషయంలో తాము చివరకు మోసపోయామని వాపోయారు. గత ఎన్నికల్లో రాజశేఖరెడ్డి, సోనియాగాంధీలు గులాబీ కండువాలు కప్పుకున్నారని, మెసలి కన్నీరు కారుస్తూ తెలంగాణ ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించారని అయితే చివరకు ప్రత్యేక రాష్ట్రం విషయంలో టీఆర్ఎస్‌ను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గద్దె దింపడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఖతం చేసి వైఎస్‌ను ఇంటికి పంపితే తప్ప ప్రత్యేక రాష్ట్రం రాదని పేర్కొన్న కేసీఆర్ తెలంగాణ కోసం తలలు నరుక్కుంటామే తప్ప వంచం అంటూ స్పష్టం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులకు వైఎస్ తీరని అన్యాయం చేశారని, 17 గనులను మూసివేశారని, ఓపెన్‌కాస్ట్‌లు పెంచడం ద్వారా, పొరుగు సేవల ద్వారా 21 వేలమందికి ఉపాధిని దూరం చేశారని ఆరోపించారు.
గత ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, రైతులకు ఎరువులు కరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అందుకే ఆ పార్టీని ఇంటికి పంపేందుకే మహాకూటమిగా ఏర్పాడ్డామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రత్యేక తెలంగాణ తప్పక ఏర్పడుతుందని, అప్పుడు తాను ఎలాంటి అధికార పదవులూ స్వీకరించనని ఆయన పేర్కొన్నారు.