వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > రాజకీయం వ్యాపారం చేస్తున్న పార్టీలు: జేపీ
వార్తలు
రాష్ట్రంలోని పలు పార్టీలు రాజకీయ వ్యాపారం చేస్తున్నాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. ఇలాంటి రాజకీయాన్ని అంతంచేసి కులం ప్రసక్తిలేని సమాజాన్ని స్థాపిద్దామంటూ ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 62 సంవత్సరాల నుంచి మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ప్రతిసారి ఓటరు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓట్లు కొనుక్కొంటూ, మద్యంలో ముంచే రాజకీయ పార్టీలను తరిమికొడదామని పిలుపునిచ్చారు. రాజకీయాలను వ్యాపారం చేస్తూ, దేశాన్ని దోచుకొంటున్న పార్టీలకు ఓటువేయవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సత్తా పార్టీలో నిజాయితీపరులు, సమర్ధులు, సంకల్పం, త్యాగం చేసేవారికే స్ధానం ఉందికానీ, కుటుంబ పాలనకు తావులేదన్నారు.

దేశంలో అందరికీ ఆరోగ్యం, సమన్యాయం జరగాలంటే లోక్‌సత్తా అభ్యర్థులనే ఎన్నుకోవాలని కోరారు. బంగారంలాంటి మీ ఓట్లను మురికికూపంలో వేయవద్దని ఓటర్లకు సూచించారు. ఒక ఓటుకు వెయ్యి రూపాయలు మీరు తీసుకొంటే, మీరు 2 లక్షల 30 వేల రూపాయలు నాయకులకు చెల్లిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు.