వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > మాయ మాటలు నమ్మొద్దు: వైఎస్ విజ్ఞప్తి
వార్తలు
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహాకూటమి చెబుతున్న మాటలు నమ్మోద్దొంటూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన వైఎస్ ఆయా ప్రాంతాల్లో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు పిట్టలదొరలా రోజుకో వాగ్ధానం చేస్తున్నారంటూ విమర్శించిన ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో బాబుకు ఈ ఉచితాలన్నీ ఎందుకు గుర్తుకురాలేదంటూ ప్రశ్నించారు.

అలాగే తెదేపా నేతృత్వంలోని మహాకూటమిని ఓ మాయాకూటమిగా పేర్కొన్న ఆయన వారు నెలరోజుల్లో కనీసం సీట్ల సర్ధుబాటు కూడా చేసుకోలేకపోయారని విమర్శించారు. గత ఐదేళ్ల తమ పాలనలో చెప్పిన హామీలను నెరవేర్చామా లేదా అంటూ ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఉచిత విద్యుత్, రైతుల రుణాలు మాఫీ, ఉపాధి హామీలాంటి పలు పథకాలతో ప్రజలను ఆదుకున్నామని ఆయన పేర్కొన్నారు.

గతంలో ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యం కాదని తమపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు రోజులు 12 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తామని ఎలా చెప్పగల్గుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మబోరంటూ ఆయన పేర్కొన్నారు.