పాలమూరు అభివృద్ధి చేసేందుకు తాను పాటుపడతానని, ఇందుకోసం స్థానికంగానే ఉండాలని నిర్ణయించిన తాను ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు ప్రకటించారు. పాలమూరులో తాను ఇల్లు కట్టుకునేందుకు ఏర్పాటు చేయమని ఇప్పటికే తనవారికి చెప్పానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తపేట, మదనపురం, ఉట్కూరు, నర్వ, మక్తల్, దామరగిద్ద తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని కాంగ్రెస్ గద్దెనెక్కిందని అయితే అధికారంలోకి వచ్చాక ఆ ప్రాంత అభివృద్ధిని మాత్రం మర్చిపోయిందని విమర్శించారు.
అందుకే పాలమూరుకు కాదని పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోతుంటే పాలకులు కళ్లు మూసుకున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు 610 జీవోను అమలు చేయడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. తన కడప, తన కడుపు నిండితే చాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటున్నారని అందుకే కోట్లు దిగమింగి, కొడుకు ఖాతాలు పెంచుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు.