వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రజారాజ్యం మేనిఫెస్టో
వార్తలు
చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం ప్రకటించింది. మొత్తం 104 సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా ముందుగా చెప్పినట్టుగా సామాజికన్యాయానికి పెద్దపీట వేసిన పీఆర్పీ మేనిఫెస్టోలోనూ తన ప్రత్యేకత చాటుకుంది.

పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న పీఆర్పీ అధినేత చిరంజీవి మేనిఫెస్టోలోని అంశాలను చదివి వినిపించారు. తమ మేనిఫెస్టో ప్రజాకర్షణకోసం కాదని వారి సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్న ఆయన తమ ఎన్నికల ప్రణాళికలోని విభిన్న పథకాలను ఏకరువు పెట్టారు.

ఇందులో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే రూ. 100కే వంట సరుకు పథకాన్ని అమలు చేస్తామని, ఆడపిల్లలకు పసుపు కుంకుమ పథకాన్ని అమలు చేస్తామన్నారు. అర్హులైనవారికి రూ. 100కే గ్యాస్‌బండ ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే నిరు పేదలకు, కుటీర పరిశ్రమలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.

వీటితోపాటు సగం స్టాంపు డ్యూటీకే మహిళలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని చిరంజీవి పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని వికలాంగులకు రూ. 1500 భృతి, ఉచిత విద్య, వైద్యం అందించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని అన్నారు.

వీటితోపాటు స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయిస్తామని, గత 15 ఏళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయిస్తామన్నారు. అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో మహిళకు 50శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు తెలిపారు. అలాగే నిరుద్యోగులకు రూ. 1000 భృతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా పీఆర్పీ అధికారంలోకి వస్తే దశలవారిగా బెల్టు షాపులను అరికట్టడం ద్వారా సంపూర్ణ మధ్యనిషేధాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శాసనపరమైన చర్యలు చేపడుతామన్నారు. గర్భిణుల ఆరోగ్యోం కోసం ఆరు నెలలపాటు ప్రతి నెల రూ. 1000లను అందజేస్తామని అన్నారు.

ఇక ఉద్యోగులకు మరో 10శాతం కరువు భత్యాన్ని ఇస్తామని పేర్కొన్న చిరంజీవి ప్రతి మండలానికి సంచార వైద్యశాలను ప్రవేశపెట్టనున్నట్టు, ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.