ఓటరుకు ఎన్నికల సంఘం వెసులుబాట | |
ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా ఓటరు జాబితాలో పేరుంటే సదరు వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. అయితే తాము జాబితాలో పేర్కొన్న ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు ఉంటే ఓటుహక్కును వినియోగించుకోవచ్చని ఈసీ సోమవారం ప్రకటించింది.
దీని ప్రకారం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆదాయపన్ను గుర్తింపుకార్డు (పాన్)లు చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, పోస్టాఫీసులు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌లు, రైతు పాస్‌బుక్కులులాంటివి చూపించి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
వీటితోపాటు ఫోటోతో కూడిన ఆస్తి పత్రాలు, పట్టాలు, రిజిష్టర్డ్ దస్తావేజులులాంటి వాటిని కూడా గుర్తింపు కోసం వాడవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వరకు ప్రభుత్వశాఖలచే జారీచేయబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పత్రాలు, పెన్షన్ డాక్యుమెంట్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ పెన్షన్ బుక్కులు, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ వితంతువులకు జారీ చేసిన ఫోటో పెన్షన్ ఉత్తర్వులు, ఆయుధ లైసెన్సులు తదితరాలను ఎన్నికల సమయంలో గుర్తింపు కోసం వాడవచ్చు.
వీటితోపాటు స్వతంత్ర సమరయోధులకిచ్చిన ఫోటో గుర్తింపుకార్డులు, ఫోటోతో కూడిన వికలాంగ గుర్తింపుకార్డులు, ఉపాధిహామీ పథకం కింద జారీచేసిన ఫోటో గుర్తింపుకార్డులు, కార్మికశాఖచే జారీచేయబడిన ఆరోగ్యబీమా పథకం గుర్తింపు కార్డులను ఓటింగ్ సమయంలో చూపించడం ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.