కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమల శెట్టి సునీల్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం అమోదించింది. సునీల్ పౌరసత్వంపై వెలువడిన సందేహంతో ఆయన నామినేషన్ ఆమోదాన్ని పెండింగ్‌లో పెట్టారు. సునీల్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఆయన భారతీయుడే కాదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు చెందిన ప్రత్యర్థులు ఆరోపించారు.
దీనిపై కాకినాడ రిటర్నింగ్ అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన నామినేషన్ ముద్ర వేయకుండా సస్పెండ్‌లో ఉంచి, పౌరసత్వం నిరూపించుకునేలా సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు పక్షాల తరపున లాయర్లు హాజరై తమ వాదనలు వినిపించారు. అదే సమయంలో ప్రజారాజ్యం నేతలు ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ.సుబ్బారావును కలిసి సునీల్ పౌరసత్వంపై పలు రుజువులు చూపించారు.
సునీల్‌కు చెందిన భారత పాస్ పోర్ట్, ఇతర డాక్యుమెంట్లను సుబ్బారావుకు చూపించారు. ఈ డాక్యుమెంట్లను పరిశీలించిన సుబ్బారావు సంతృప్తి చెందారు. సునీల్ కుమార్ నామినేషన్‌కు ఎలాంటి ఆటంకం లేదని సుబ్బారావు స్పష్టం చేశారు. దీంతో ఆయన నామినేషన్ పత్రాలపై రిటర్నింగ్ అధికారి ఆమోదముద్ర వేశారు.