వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > తిరుగుబాటు అభ్యర్థులకు "మెగా" విజ్ఞప్తి
వార్తలు
టిక్కెట్లు ఆశించిన భంగపడి, తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారు తక్షణం పోటీ నుంచి తప్పుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పార్టీ టిక్కెట్లు లభించని అభ్యర్ధులు రెబల్స్‌గా నామినేషన్లు వేయడం తీవ్ర మనస్తాపం కలిగిస్తోందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీని కాదని, తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీ చేయాలనుకోవడం బాధాకరమన్నారు. అనేకమంది అర్హులైన ఆశావహులకు టిక్కెట్లు దక్కకపోవడం వాస్తవమేనని, అయితే అందుకు కారణాలు లేకపోలేదని ఆయన తెలిపారు.

అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న లక్ష్యంతో పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నామని, అందువల్లనే ఇటువంటి విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పటిష్టతకు విశేష సేవలందించిన పలువురికి న్యాయం చేయలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ లక్ష్యతో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిందో, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల శ్రేయస్సు, పార్టీ గెలుపు దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేయవలసి వచ్చిందని, ఈ సమయంలోనే ఎంతోకొంత త్యాగం చేయక తప్పదని చిరంజీవి ప్రకటనలో పేర్కొన్నారు.