వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > తృతీయ కూటమితోనే తెలంగాణా సాధ్యం: బర్దన్
వార్తలు
కేంద్రంలో తృతీయ కూటమి అధికారంలోకి వస్తేనే ప్రత్యేక తెలంగాణా సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్దన్ స్పష్టం చేశారు. కేంద్రంలో మూడో కూటమి, రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి ప్రత్యేక తెలంగాణా వచ్చినట్టేనని ఆయన జోస్యం చెప్పారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఈ ఐదేళ్ల పాలనా కాలంలో తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఆకర్షించేందుకు తిరిగి అదే హామీలను గుప్పించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సోనియా సభలకు ప్రజలను భారీగా తరలించినప్పటికీ స్పందన కరువైందని బర్దన్ విమర్శించారు. సత్యం, మేటాస్ సంస్థల కుంభకోణాలు వైఎస్ పాలనకు అద్దం పడతాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణా విషయంపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణా విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని బర్దన్ పిలుపునిచ్చారు.