ఆత్మ- పరమాత్మ గురించి చెప్పాలంటే- సాధువులు, మతబోధకులు చాలా కథలు చెపుతుంటారు. కానీ ఆధ్యాత్మికత పాళ్లు ఎక్కువగా ఉండటంతో వారు చెప్పేవి అందరికీ అర్థం కావు. కానీ నటుడు మోహన్ బాబు చెప్పిన ఓ కథ అందర్నీ ఆకట్టుకుంది. బుధవారం ఓ విలేకరి ఆయనను అడిగిన ప్రశ్నకు సమాధానమే ఈ కథ.
సచ్చీలుడైన నాయకుడిని ఎన్నుకోండని, మేస్త్రీ చిత్రంలో ప్రేక్షకులకు చెప్పాం అన్నారు. మరి సచ్చీలుడంటే ఎవరు? మీరెవరికి ఓటేస్తారని మోహన్ బాబును అడిగితే, అది నాలో ఉన్న ఆత్మకే తెలుసునంటూ, అసలు ఆత్మ-పరమాత్మపై ఓ కథ చెబుతానంటూ, విషయాన్ని పక్కదోవ పట్టించి చక్కటి కథ చెప్పారు.
భగవంతుడు మనిషికి అన్ని శక్తుల్ని ప్రసాదించాడు. ఆ శక్తులతో మనిషి మంచి పనులకంటే చెడు పనులే ఎక్కువగా చేయడంతో, విసిగిపోయిన భగవంతుడు ఇచ్చిన శక్తుల్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత మిగిలి దేవుళ్లందర్నీ పిలిచి, విషయం చెప్పాడు.
మళ్లీ మనిషికి శక్తులు ఇస్తే ఏదో చెడు చేస్తాడు కనుక ఓ చెట్టులోనో, పుట్టలోనో ఆ శక్తుల్ని దాచేయనా? అని అడిగాడట. దానికి ఆ దేవుళ్లంతా, ఎక్కడ దాచినా మనిషి తిరిగి తెచ్చుకోగలడు. కథ మళ్లీ మొదటికే వస్తుంది. కనుక మనిషి వెళ్లలేని, చూడలేని చోటు... మనిషిలోపలి భాగం. కనుక మీరు ఆ శక్తులన్నిటినీ మనిషిలోపలే దాచేయండి అన్నారట. దాంతో భగవంతుడు అలాగే చేశాడు.
అందుకే ప్రతి మనిషిలోనూ తెలీని శక్తులున్నాయి. వాటిని సరైన విధంగా మలచుకుంటే భగవంతుడు, లోకరక్షకుడు అవుతాడు. ఈ ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు మనిషే కనుక్కున్నాడు. బల్బు, ఫోన్, రాకెట్, ఇప్పుడు ఇన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ వచ్చాయంటే, వాటిని బయటపెట్టింది మనిషే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులెవ్వరూ చేయలేదు. ఇవన్నీ మనిషే చేశాడు.
ఆ మనిషిలో భగవంతుడు పెట్టిన అద్భుత శక్తి దాగి ఉంది. మన ఆలోచనలు ఆత్మ అయితే శక్తి పరమాత్మ. అందుకే, నేను చిట్టచివరికి ఎవరికి ఓటు వేస్తాననేది నా ఆత్మకే తెలుసు. నాకు కూడా తెలియదు. అని ముగించారు.