దేశంలో నివశించే ప్రతి పౌరునికీ సమాన హక్కులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే తారతమ్యాలు కాంగ్రెస్ పార్టీలో లేవని ఆయన స్పష్టం చేశారు. భారతీయులందరికీ సమాన హక్కులుండాలని, భారత దేశం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్ళాలన్నదే తమ పార్టీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
బుధవారం జరిగిన అనాకాపల్లి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ఆరంభించిన రాహుల్.. దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలపైనే ఆధారపడి ఉందన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే సత్తా గ్రామాల్లోని పేదవానిలోనే ఉందని రాహుల్ ఉద్ఘాటించారు.
కష్టాన్ని ఎదుర్కోవడం, ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండటం, నీతిగా బతకడం, నిర్మోహమాటంగా జీవించడం పేదవాని లక్షణాలన్నారు. అవే ఈ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రచారాన్ని ముగించుకున్న రాహుల్ నేరుగా విశాఖపట్నానికి వెళ్లారు.