2009 లోక్‌సభ ఎన్నికలకుగాను కొత్తగా 11 జనరల్ స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు ఖాతాలో జమ అయ్యాయి. ఇంతకుముందు ఎస్సీకి కేటాయించిన 79 రిజర్వుడు స్థానాలకు కొత్తగా 5 కలిసి 84కి చేరుకున్నాయి. ఎస్టీకి ఇంతకుముందు 41 రిజర్వుడు స్థానాలు వుంటే, తాజాగా మరో 6 వచ్చి చేరడంతో ఆ సంఖ్య 47కి పెరిగింది.
మొత్తం 543 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో 499 స్థానాలు పునర్విభజనకు గురయ్యాయి. అస్సాం, నాగాలాండ్, జమ్ము-కాశ్మీర్ మినహా దేశమంతటా తొలిసారిగా ఫోటో ఎలక్ట్రాల్ రోల్స్ వినియోగించనున్నారు.
543 పార్లమెంటు సీట్లకు గాను 522 నియోజకవర్గాల్లో ఫోటో ఎలక్ట్రాల్ రోల్స్ వినియోగిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలతోపాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వీటిని వినియోగించనున్నారు.
ఓటరు నమోదు కార్యక్రమంతో 4.3 కోట్లమంది కొత్తగా ఓటర్ జాబితాలోకి చేరారు. 2004లో 67.1 కోట్లమంది ఓటర్లుండగా 2009 నాటికి ఈ సంఖ్య 71.4 కోట్లకు చేరింది. అలాగే 2004లో 6 లక్షల 87 వేల 402 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈసారి 8 లక్షల, 28వేల 804 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.
లోక్‌సభ నియోజకవర్గాలన్నిటిలో అన్నవో నియోజకవర్గం అతిపెద్దది కాగా లక్షద్వీప్ అతిచిన్నది. అన్నవో నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 18 లక్షల 97వేల 474 కాగా లక్షద్వీప్ ఓటర్ల సంఖ్య 44 వేల 424. ఉత్తరప్రదేశ్ అత్యధిక పోలింగ్ కేంద్రాల(1,28,112)ను కలిగి ఉంది. సిక్కిం అతి తక్కవ(581) పోలింగ్ కేంద్రాలను కలిగి ఉంది.