తొలిదశ పోలింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇలా ఓటు వేసినవారిలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన చిరంజీవి కూడా ఉండడం విశేషం.
పోలింగ్ సందర్భంగా కుటుంబంతో సహా జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలకు చేరుకున్న చిరంజీవి అక్కడ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ మొహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో ఓటు వేశారు. నడవలేని పరిస్థితిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అంబులెన్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి వెంటవచ్చినవారి సాయంతో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
వీరితోపాటు జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు, ఆయన తనయుడు, హీరో వెంకటేశ్, డాక్టర్ సి. నారాయణరెడ్డి పరుచూరి బ్రదర్స్ తదితరులు ఓటేశారు.