తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎదురుదాడికి దిగారు. చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, వాటికి సమాధానం చెప్పుకోలేకే తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు.
కాంగ్రెస్-పీఆర్పీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి నిప్పులు చెరిగారు. తన మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేకే చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఎదురు దాడికి దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలు తెదేపాకు ఓటు వేస్తే మునిగిపోతారని హెచ్చరించారు.
చంద్రబాబు కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నారా లేక తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్‌కు సీఎంగా వ్యవహరించారే గానీ.. రాష్ట్రానికి కాదని చిరంజీవి ధ్వజమెత్తారు. గతంలో తనను పొగడిన ఆయన ఇపుడు విమర్శలు ఎలా చేస్తున్నారని చిరంజీవి ప్రశ్నించారు.