వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > తెదేపాతోనే రాష్ట్రానికి భవిష్యత్: జూ.ఎన్టీఆర్
వార్తలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయకుంటే ప్రజలకు భవిష్యత్తే ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ సోమవారం టీవీ ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లకోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి నీచానికైనా దిగజారుతుందని పేర్కొన్నారు.

తొలిదశలో తమకు ఓట్లు దక్కలేదని తెలిసి రెండోదశలో లబ్ధి పొందేందుకు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రజలు కలిసివుంటే కాంగ్రెస్‌వారికి నచ్చడం లేదని అందుకే ప్రజలు విడిపోయి దెబ్బలాడుకుంటుంటే చూడాలనే ధోరణితోనే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణపై విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీపైనా విమర్శలు గుప్పించారు. నెలకు ఓ కుటుంబానికి ఎన్ని సరకులు కావాలో తెలియనివారు పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.

వారిచ్చే కేజీ కందిపప్పు, కేజీ ఉప్పు, కేజీ నూనె వీటితోనే నెలంతా గడపడానికి ఇదేమన్నా వంటలాటా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అదేసమయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హామీ ఇచ్చిన నగదు బదిలీ పథకం గురించి మరోమారు ఏకరువు పెట్టారు. దళారులతో సంబంధం లేకుండా ప్రతి పేదవారికీ నెలకు రూ. 2000, రూ. 1500, రూ. 1000 ఇస్తామని తెలిపారు.

చంద్రబాబు చెప్పిన ఈ పథకం అమలులోకి వస్తే పేదల జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు. ధరలు ఆకాశానంటుతున్న నేటి రోజుల్లో టీడీపీ ప్రవేశపెట్టనున్న నగదు బదిలీతోనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.