ఈనెల 16వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి మరోమారు ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి మాయాకూటమని తాను ఎప్పుడో చెప్పానని, తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్డీయేతో కలవడంపై స్పందించాల్సింది వామపక్షాలు, తెలుగుదేశం పార్టీలేనని, తాను కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం ప్రజల ఓట్లతో సీట్లు సంపాదించుకోవడం కోసం సిద్ధాంతాలకు స్వస్తి చెప్పి మాయాకూటమిగా ఆ నాలుగు పార్టీలు చేతులు కలిపాయని చిరు గుర్తు చేశారు. ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న మహాకూటమి పార్టీల వైఖరిని ప్రజలకు తాము ముందుగానే వివరించామని ఆయన అన్నారు.
ఎన్నికల అనంతరం పార్టీలోని వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్న చిరంజీవి సోమవారం నాడు మహిళారాజ్యం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్డీయేతో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీకి సంపూర్ణ ఆధిక్యం వచ్చి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.