ఈనెల 16వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపు రోజున ఎలా నడుచుకోవాలన్న అంశంపై అఖిలపక్ష పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐవీ.సుబ్బారావు బుధవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించిన ఈసీ.. కౌంటింగ్, ఫలితాల ప్రకటన కూడా అదే స్ఫూర్తితో నిర్వహించాలని తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలట్ లెక్కిస్తామని ఈసీ సుబ్బారావు తెలిపారు. అర్థగంటలో పోస్టల్ బ్యాలట్ లెక్కింపు పూర్తి చేసి 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. లెక్కింపు ఏజెంట్లు శుక్రవారం ఉదయం తమకు కేటాయించిన కేంద్రాలకు ఉదయం 8 గంటల లోపే చేరుకోవాలని ఈ సందర్భంగా ఐవీ సూచించారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు 20 నిమిషాల్లో ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ప్రతి రౌండ్‌లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలను కౌంటింగ్ ఏజెంట్లకు, మీడియాకు అందజేస్తామని ఈసీ చెప్పారు.
కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పోలీసులతో గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని 14, 15, 16 తేదీల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఈసీ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాన్ని నిషేధించినట్లు సుబ్బారావు వివరించారు.
కాగా, కౌంటింగ్ రోజున పార్టీలు విజయ యాత్రలు నిర్వహించడంపై ఈసీ ఆంక్షలు విధించడాన్ని రాజకీయ పక్షాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభ్యంతరాలను విన్న ఈసీ మాట్లాడుతూ, ఆంక్షలపై పోలీసు అధికారులతో మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పారు.