కేంద్రంలో ఏ ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న అంశంపై మే 16 తర్వాత స్పందిస్తానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. మే 16వ తేదీకి ముందు పొత్తులపై తానేమీ చెప్పలేనని ములాయం విలేకరులకు స్పష్టం చేశారు.
యూపీఏకు బయటనుంచి మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం ఆర్జేడీ, ఎల్జేపీ పార్టీలతో నాలుగో కూటమిలో చేరింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో హంగ్ పార్లమెంట్ తథ్యం అని తేలడంతో తమ పాత్ర మరింత కీలకం కానుందని ములాయం జోస్యం చెప్పారు.
అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎస్పీ, ఎల్జేపీ వెనకబడిపోయాయన్న అభిప్రాయాలను ములాయం వ్యతిరేకించారు. తన కుడి భుజం అయినటువంటి అమర్‌సింగ్ రిటైర్మెంట్ అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని అమర్‌సింగ్‌తో చెప్పానన్నారు. ఇదిలావుంటే మొన్న రిటైర్మెంట్ ప్రకటన చేసిన అమర్‌సింగ్ నేడు ములాయంను వీడి వెళ్లనని చెప్పారు.