అఖిలాంధ్ర తెలుగు ప్రజలకు ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటుడు కొణిదెల శివశంకర ప్రసాద్ ఉరఫ్.. చిరంజీవి. స్వతహాగా సున్నిత మనస్కుడైన చిరు.. రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు నెలల తరబడి తర్జన భర్జనలు పడ్డారు.
చివరకు.. ఎన్టీఆర్ స్ఫూర్తి, భారతరత్న అబ్దుల్ కలాం ప్రేరణ.. కారణంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు గత ఆదివారం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే.. ఈయన రాజకీయాల్లో నెట్టుకొస్తారా లేదా అన్నది ప్రతిఒక్కరిని తొలిచేస్తున్న ప్రశ్న. ఆంధ్రుల అభిమాన హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ యాక్టర్.. రాజకీయ జీవితంలో నటిస్తారో లేదా జీవిస్తారో వేచి చూడాల్సిందే. దీనిపై ఒక విశ్లేషాణాత్మక వీడియోతో సహా.. చిరు బయోగ్రఫీని చూడండి.
మెగాస్టార్ బయోగ్రఫీ.. మెగాస్టార్‌గా తెలుగునాట సుపరిచితమైన నటుడు చిరంజీవి. 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మిషనరి హాస్పిటల్‌లో కొణిదెల అంజనాదేవి, కె.వెంకట్రావు అనే దంపతులకు జన్మించారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్. ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.
విద్యాభ్యాసం.. చిరంజీవి విద్యాభ్యాసం ఒక చోట సాఫీగా సాగలేదు. తండ్రి ఉద్యోగరీత్యా పలు చొట్లకు బదిలీ కావాల్సి వచ్చేది. అయన విద్యాభ్యాసం మొదట నిడదవోలులో ప్రారంభం కాగా, తర్వాత.. గురజాల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు అంటూ సాగింది. చిన్న వయస్సు నుంచే చిరంజీవికి ఉన్న సినిమా ఆసక్తి పాఠశాల విద్యాభ్యాసంలోనే స్టేజ్ డ్రామాల్లో నటించేందుకు దారితీసింది.
ఆయన హైస్కూలు చదివేటప్పుడు మొదటిసారిగా నటించిన పరంధామయ్య పంతులు డ్రామాకుగాను మొదటి బహుమతి అందుకున్నారు. అనంతరం ఒంగోలులోని పీఆర్ శర్మ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ గ్రూపులో చేరారు. పిమ్మట నర్సాపూర్ కళాశాలలో బీకాం ముగించారు.
|