ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > 'ప్రజారాజ్యం' చుట్టూ తెలుగు రాజకీయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'ప్రజారాజ్యం' చుట్టూ తెలుగు రాజకీయం
చిరంజీవి రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల నాయకుల మధ్య వాగ్బాణాలు మరింతగా ఊపందుకున్నాయి. రాజకీయ సమీకరణాలపై పార్టీలు అప్పుడే మల్లగుల్లాలు పడుతున్నాయి. కాకిలెక్కల్లో కాలం గడుపుతున్నాయి. అయితే అందరికీ ప్రజారాజ్యమే ఆసక్తికర అంశంగా మారింది.

నిన్నటి దాకా కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన వామపక్షాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. శాసనసభ, బహిరంగ సమావేశాల్లో కూడా విమర్శలతో కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు కూడా స్వరం మార్చారు. కాంగ్రెస్‌ పాలనపై దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్‌తో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


టీఆర్ఎస్‌ నాయకుడు చంద్రశేఖర రావుతో రెండు దఫాలుగా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వీరి మధ్య తాజా చెలిమికి దారి తీసింది. ప్రధానిపై ప్రవేశ పెట్టిన ఆవిశ్వాస తీర్మానం వారి మధ్య సాన్నిహిత్యానికి దోహద పడింది. మాయావతితో కలిసి మూడో ప్రత్యాయ్నం ఏర్పాటు చేయడంలో ఇద్దరు నాయకులు కలసి పని చేశారు.

కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వారే కావడంతో వారి మధ్య ప్రత్యేక దూతల అవసరం ఉండదు. ఒకప్పుడు చంద్రబాబుపై కేసీఆర్ విరుచుకు పడే వారు. ఈ మధ్య కాలంలో ధోరణి అది కనిపించడం లేదు. ఉపఎన్నికల్లో దెబ్బతిన్న కేసీఆర్‌కు జ్ఞానోదయం అయ్యింది. పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే చేదు అనుభవాలు చవి చూడక తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు.

పైగా దేవేందర్ గౌడ్ నవతెలంగాణా పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ఇటు కేసీఆర్‌కూ, అటు చంద్రబాబుకూ గుబులు పుట్టుకుంది. దీంతో పరస్పర అంగీకారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కేసీఆర్ ప్రజారాజ్యం పార్టీపై కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. చిరంజీవి ఇప్పటికే కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పైగా పార్టీ ఆవిర్భావ సభలో ఆ ప్రాంత ప్రజల మనోగతానికి అనుకూలంగా నడుచుకుంటామని ప్రకటించారు.

దీంతో రెండు పార్టీలకూ అవగాహన కుదిరే అవకాశమూ లేకపోలేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చిరంజీవిపై ఎక్కడా విమర్శలు చేయరాదని పార్టీ శ్రేణులకు సూచించారు. పైగా ప్రజారాజ్యం టైటిల్ వివాదంలో న్యాయవాది చెన్నకృష్ణయ్యతో రాజీ కుదిర్చిన హరిప్రసాద్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రధాన భూమిక పోషించే వ్యక్తి కావడం గమనార్హం.

ప్రజారాజ్యం విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త జాగ్రత్తగా నడుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. మున్ముందు ఒప్పందాలు కుదుర్చుకోవలసి వస్తే... అనే ఆలోచనతోనే ఉంది. ఇక వామపక్షాలు చేరో దారి పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే చిరంజీవి వైపు రెండు పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. సీపీఎం తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాసుకు తిరిగేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు ఆ పార్టీ నాయకులతో కలసి తెరపైకెక్కుతున్నారు.


సీపీఐ మాత్రం తెలుగుదేశంతో జత కట్టేందుకు ససేమిరా అంటోంది. చిరంజీవి పార్టీ వైపు ఎదురు తెన్నులు కాస్తోంది. సీపీఐ నాయకుడు నారాయణ ఇప్పటికే చిరజీవికి అనుకూలంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా చిరంజీవి పార్టీ ప్రభావం ఎంత వరకూ ఉంటుంది ? ఎవరితో కలిస్తే బలాబలాలు ఎలా ఉంటాయి ? అనే అంశాలను లెక్క కడుతోంది. మొత్తంపై తెలుగు రాజకీయం ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవిల చుట్టూ తిరుగుతోంది.
మరిన్ని
ఢిల్లీ చేరిన 'ప్రజారాజ్యం' పంచాయతీ
రాజకీయ పార్టీలకు 'మెగా' ఛాలెంజ్
విష్‌ యు హ్యాపీ పాలిటిక్స్‌ టూ యూ....
'రంజు'గా మారిన రాష్ట్ర రాజకీయాలు  
తారక రాముని నామ స్మరణలో పార్టీలు  
రాజకీయ చట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?