ప్రజారాజ్యం పార్టీతో ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని అప్పుడే వివాదాల వడగాలులు చుట్టుముడుతున్నాయి. సినీ నటుడిగా రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్ర ప్రజలను కూడా అలరించిన చిరంజీవి తన మూడు పదుల నటనా ప్రస్థానంలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత దూషణలకు సైతం వెరవని రాజకీయ చదరంగంలో... ఆయన అడుగిడిన నాటినుంచి విమర్శలు ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్నాయి. అన్నప్రాశననాడే ఆవకాయ అన్న చందంగా తొలి వివాదమే చిరంజీవికి చిత్రంగా ఎదురైంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన పార్టీ పేరు ప్రకటించిన మరుసటి రోజే "ప్రజారాజ్యం" తనదంటూ కడప జిల్లా వాసి చెన్న కృష్ణయ్య పత్రికలకెక్కారు. ఈ వార్త చిరు శిబిరంపై పిడుగులా తాకింది. అయితే ఆ సమస్య వచ్చినంత వేగంగానే తిరుగుముఖంపట్టి సద్దుమణిగింది.
కానీ పార్టీ పేరును ఉపసంహరించుకునేలా చేయడానికి చిరంజీవి చెన్న కృష్ణయ్యతో లాలూచీ పడ్డారని అనేక విమర్శలు వచ్చాయి. ఇదిలావుంటే తాజాగా మరో వివాదం చిరంజీవిని చుట్టుకోవడానికి సిద్ధమైంది. తమను కాదని తమ కన్నకూతురుకి చిరంజీవి దగ్గరుండి బలవంతపు వివాహం జరిపించారని గురువారం సదరు వధువు తల్లితండ్రులు మీడియాను ఆశ్రయించారు.
|