ప్రజారాజ్యం అధినేత, సినీ నటుడు చిరంజీవిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు పెద్ద చర్చకే దారితీశాయి. తెలుగుదేశం పార్టీ నుంచి 'ప్రజారాజ్యం'లోకి వలసలు ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురైనట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
సాధారణంగా తెదేపా అధినేతకు స్వతహాగా కంగారు పడే మనస్తత్వం ఉంది. కంటిపై కునుకులేకుండా నిరంతరం అప్రమత్తగా ఉండటం ఆయన ప్రత్యేక లక్షణం. కానీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఇందుకు పూర్తిగా భిన్నం. వైఎస్ ఎపుడు చూసినా నిద్రమత్తులో తూగినట్టుగా కనిపిస్తారు. కాన్ఫిడెన్స్ లెవల్స్‌లో ఇద్దరూ విభిన్నం. ఎన్ని తప్పులు చేసినవారైనా తన వారు అనుకుంటే వైఎస్ అక్కున చేర్చుకుని, వారిపై పూర్తి నమ్మకం ఉంచుతారు.
కానీ, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో బాగా వెనుకబడి వున్నారు. చివరకు రక్తం పంచుకు పుట్టిన సోదరుడైనా సరే దగ్గరకు రానివ్వరు. ఇది ఆయనలోని మైనస్ పాయింట్‌గా కొందరు చెపుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం ఆయనకున్న దమ్ముకు నిదర్శనమని అంటారు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఆ మాత్రం దమ్ము లేకపోతే రాణించడం కష్టమంటారు. అలాగే ఉత్తరాది రాజకీయ నాయకుల శైలిని వైఎస్ పుణికి పుచ్చుకున్నారు. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో అసలైన దక్షిణాది నేతగా కనిపిస్తారు.
రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల అధినేతల మనస్తత్వాలు ఇలా ఉంటాయి. కానీ.. ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి మనస్తత్వం వీరిద్దరికి పూర్తిగా విరుద్ధం. అసలే సున్నిత స్వభావిగా పేరున్న చిరంజీవి... ఎవరి జోలికి వెళ్ళరు. కోరి వివాదం తెచ్చుకోరు. మనసుకు గాయమైతే కొన్ని రోజుల తరబడి ఆయన ఎవరికీ కనించరు. కానీ ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్న చిరంజీవి గతంలో లాగా నాలుగు గోడల మధ్య ఉండడం సబబు అనిపించదు.
విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. నిజమైన నాయకుడిలా ఎదగాలి. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి చంద్రబాబు నాయుడికే కాదు, వైఎస్‌కు కూడా పెద్ద ప్రమాదంగా మారనున్నారు. దీంతో భవిష్యత్‌లో బాబుతో పాటు.. వైఎస్ చేసే విమర్శలకు చిరంజీవి తట్టుకోవాలి. సందర్భోచితంగా, హీరోచితంగా వాటికి కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది.
చిరంజీవి ఇక మీదట సర్వేజనా సుఖినోభవంతు అన్న రీతిలో వ్యవహరిస్తే లాభం ఉండదు. గతంలో మాదిరిగా సున్నితంగా వ్యవహరిస్తే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం. అదే సమయంలో సందోర్భచితంగా విమర్శలను తిప్పికొడుతూ.. యుద్ధరంగంలో దూకిన యువ సైనికుడిలా ముందుకు సాగిస్తే ఫలితం ఉంటుంది.
|