రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అదేసమయంలో ప్రధాన సమస్యలన్నీ తెరపైకి వస్తున్నాయి. వీటిని ప్రధానాంశాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వీటికి తోడు అవినీతి, అక్రమాలు, జలయజ్ఞం సాఫీగా సాగక పోవడంతో పాటు.. భైంసా అల్లర్లు, మొద్దుశీను హత్య తదితర అంశాలు జఠిల సమస్యలుగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా పరిటాల హత్యకేసులో కీలక నిందితుడు మొద్దుశీను జైల్లోనే హత్యకు గురికావడంతో రాష్ట్ర సర్కారు ఉలిక్కిపడేలా చేసింది. విపక్షాలతో పాటు అన్నివర్గాలూ దీనిపై తీవ్రంగా స్పందించాయి. ఇది సర్కారు హత్యేనని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతికి, అక్రమాలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయన్న ఆరోపణలకు ఈ హత్యోదంతం బలం చేకూరుస్తోంది.
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల దశ నుంచే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు.. పరిటాల హత్య, రాజధానిలో బాంబు పేలుళ్లు, ఇద్దరు మంత్రుల మధ్య ఇసుక తుఫాను రేపిన గొడవ.. ఇతరాత్రా సంఘటనలు సర్కారుపై మరింత ఒత్తిడి పెంచాయి.
వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఇలాంటివి అధికార పార్టీకి మరింత తలనొప్పిగా మారాయి. అలాగే.. నిత్యావసరాల ధరలు ఆకాశానికి తాకడం, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాయి. ఇలాంటి సమస్యలపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగడం కూడా సర్కారుకు పెను సవాల్‌గా మారింది.
గత ఎన్నికల మిత్రులంతా మూకుమ్మడి శత్రువులుగా మారడంతో కాంగ్రెస్ ఒంటరైంది. వెల్లువెత్తుతున్న అవినీతి, జలయజ్ఞం వంటి పథకాలు సహకరించక పోవడం వంటి వాటికి శాంతిభద్రతల సమస్య కూడా తోడవటం పాలక పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటిరి పోరు తప్పదనే సంకేతాలు స్పష్టమయ్యాయి. |