జనం.. జనం... నేల మీద జనం. మిద్దెల మీద జనం. చెట్ల మీద జనం. పుట్లమీద జనం. మెగాస్టార్ పర్యటనకు రాయలసీమ వాసులు స్పందించిన తీరు. పౌరుషాల గడ్డ రాయలసీమ జనకడలిని తలపించింది. చిరంజీవిని మురిపించింది. ప్రత్యర్థులను భయపెట్టింది. మెగాస్టార్ పర్యటనలో ఎటు చూసినా, ఎక్కడ చూసినా కనుచూపు మేరలో జనమే జనం. ముఖ్యమంత్రి వైఎస్ సొంత ఇలాకాలో మెగాకు జననీరాజనాలు. కడప పట్టణం జనంతో పోటెత్తింది. కడప గడప కాస్తా.. జన సంద్రమైంది. పసిడి పట్టణం ప్రొద్దుటూరు జనతాకిడి ముందు చిన్నపోబోయింది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా నిజపాత్రను పోషిస్తూ మెగాస్టార్ చిరంజీవి రాయలసీమలోని రెండు జిల్లాల్లో చేపట్టిన ప్రజా అంకిత యాత్రకు తొలి రెండు యాత్రలకు మించి సక్సెస్ అయింది. తన తొలి పర్యటన ఉత్తరాంధ్రలో ఉరుములా ఉరిమినా. రెండో యాత్ర తెలంగాణలో తెగువ చూపినా.. రాయలసీమ గడ్డపై తనలోని 'సంయమన' పౌరుషాన్ని చూపించారు. చిరు మృదుభాషి అనే మాటకు భిన్నంగా.. తనలోని పౌరుషాన్ని చూపించారు. అంతే.. అభిమానులు, మహిళలు, కార్మికులు, కర్షకులు.. హర్షాతిరేకాలు, జేజేలు పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ పర్యటనలో భాగంగా పులివెందులలో చోటు చేసుకున్న చిన్నపాటి అపశృతి. అయినా... నిగ్రహం కోల్పోకుండా తనదైన శైలిలో పర్యటించి, ఆకట్టుకున్నారు. రాజశేఖరుని కోట పులివెందులలో "మీసం మెలేసి, తొడగొట్టి" మరీ ప్రసంగించి, తనలోని రాజకీయ నేతను ఆవిష్కరించుకున్నారు. అనంతపురం, కడప జిల్లాల పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ రెండు జిల్లాల్లో 16 నియోజకవర్గాలు.. 625 కిలోమీటర్ల మేర చిరు యాత్ర సాగింది. ఫ్యాక్షనిజం, వర్గ రాజకీయాలకు నెలవైన సీమలో ఒక్క పులివెందుల సంఘటన మినహా మొత్తం యాత్ర ప్రశాంతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్.టి.రామారావు పోటీ చేసి హిందూపురంతో పాటు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రాతినిథ్యం వహించే పులివెందుల మీదుగా చిరుయాత్ర సాగింది. యాత్రా మార్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు కంచు కోటలుగా ఉన్న పలు ప్రాంతాల్లో చిరుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. |