కల్వకుర్తి చంద్రశేఖర రావు. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత. తెలుగుదేశం మాజీ సీనియర్ నాయకులు. అధినేత చంద్రబాబుతో తలెత్తిన మనస్పర్ధలు కారణంగా పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. జిత్తులు మారి రాజకీయవేత్త. తన రాజకీయ మనుగడతో పాటు తన ప్రాభవాన్ని చాటుకునేందుకు ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని భుజస్కంధాలపైకి ఎత్తుకున్న నేత. ఆ నినాదమే ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లో ప్రబలశక్తిగా మార్చేసింది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో తిరుగులేని నేతగా చేసింది. అదే సమయంలో 'ఏ ఎండకు ఆ గొడుగు' పట్టేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. పార్టీ కార్యకర్తలు, నేతల మనోభీష్టానికి వ్యతిరేకంగా తనపంథాలోనే ముందుగు వేసే సిద్ధహస్తుడు. రాజకీయ పరిభాషకు ఏమాత్రం పొంతన లేని అసభ్య పదజాలాన్ని రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసిన నాయకుడు. అవసరమైతే తనను తాను తాకట్టు పెట్టుకునేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయని నేత. అలాంటి నేత ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పొత్తులపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా ఆయన దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భుజం భుజం కలిపి నడుస్తూనే.. ప్రజారాజ్యం నాయకులతో పొత్తుల కోసం రహస్య మంతనాలు సాగిస్తున్నారు. ' పిల్లిపాలు తాగుతూ కళ్లు మూసుకుని తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటుందట'. అలాగే కేసీఆర్ తన నాయకులతో ప్రజారాజ్యం నాయకులతో చర్చలు కొనసాగింపజేస్తూనే తామేమీ చర్చలు జరుపడం లేదని బొంకుతున్నారు. తాజాగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో తెరాస నాయకులు రామారావు, హరీష్ రావు చర్చలు జరిపారు. అది బయటకు పొక్కగానే తామేమీ చర్చలు జరుపలేదని చెబుతున్నారు. అలాగే కేసీఆర్‌తో ఇటీవల తమ్మినేని సీతారాం, భూమా నాగిరెడ్డి చర్చలు జరిపారు. అలాగే అంతకు ముందు హరీష్ రావు-అల్లు అరవింద్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని పీఆర్పీ అధినేత స్వయంగా ధ్రువీకరించారు కూడా. అయినా తామేమీ ఎవరికీ తక్కువ కాదనే రీతిలో... ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరుగలేదని కేసీర్ అంటున్నారు. మరోవైపు, వామపక్షాలు, తెలుగుదేశంలతో కలిసి తెరాస నాయకులు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెరాస పీఆర్పీతో పొత్తులు పెట్టుకున్నా.. కేసీఆర్ మాత్రం తమతోనే కలిసి ఉంటారని కె.నారాయణ (సీపీఐ) నొక్కి వక్కాణిస్తున్నారు. ఇదిలావుండగా పీఆర్పీ, తెరాస నేతల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. అయితే సీట్ల పంపిణీ విషయంలో ఒక కొలిక్కి రాకపోవడం వల్లే స్పష్టమైన ప్రకటన చేయలేక పోయినట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ప్రస్తుత రాజకీయ వినీలాకాశంలో 'గోడ మీద పిల్లి'లా చంద్రశేఖర రావు నడుచుకుంటూ రాష్ట్ర రాజకీయాలను మరింత రసదాయకంతో రక్తి కట్టిస్తున్నారు. |