ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి రోజురోజుకి రాటుదేరుతున్నారు. అసలు సిసలు రాజకీయ నేతగా తన వాగ్ధాటికి పదును పెడుతున్నారు. మాటలు తూటాలుగా పేల్చుతున్నారు. ఓ వైపు వ్యక్తిగత విమర్శలకు ఆమడ దూరంలో ఉంటూనే మరోవైపు తనపై విమర్శించే వారిపై విమర్శన బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఫలితంగా ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. తన కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ ఇలాకా పులివెందుల గడ్డపై తన తడాఖా చూపించిన చిరంజీవి.. నిన్న చంద్రబాబు అడ్డా కుప్పంలో తన సత్తాను చాటాడు. పులివెందుల పర్యటనకు ఆటంకం కలిగించిన వైఎస్ వర్గీయులకు తనదైన శైలిలో చిరు జవాబిచ్చారు. అలాగే తన చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంలోనూ చిరంజీవికి అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా జనం నీరాజనం పలికారు. స్థానికులు గంటల తరబడి నిరీక్షించారు. గత రెండు దశాబ్దాలుగా తన హవాను కొనసాగించిన చంద్రబాబు ఖంగుతినే రీతిలో కుప్పం వాసులు బ్రహ్మరథం పలికారు. నియోజకవర్గంలో 80 శాతానికిపైగా చంద్రబాబు ఓటర్లే ఉన్నప్పటికీ.. కుప్పం నియోజకవర్గంలో గురువారం మాత్రం సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కుప్పం పర్యటించిన సందర్భంగా కనిపించిన ప్రజాస్పందన గురువారం చిరంజీవికి లభించడం తెదేపా శ్రేణులను విస్మయానికి లోనుచేసింది. కుప్పం వాసి, తెదేపా అధినేత చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని చెలరేగి పోయారు. పీఆర్పీపై బాబు చేస్తున్న విమర్శలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే సమాధానం ఇచ్చారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబుపై ఏ రాజకీయ నేత ధైర్యంగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అయితే.. చిరంజీవి అందుకు భిన్నంగా బాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై చిరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినా ఎక్కడా ప్రతిఘటన ఎదురు కాలేదు కదా.. అనూహ్య స్పందన లభించడం గమనార్హం. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తమపై విమర్శలు చేయడం మానుకోకుండా కడిగి పారేస్తామని హెచ్చరించారు. తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు హుందాతనంగా నడుచుకోవాలని హితవు పలికారు. పీఆర్పీ వలస పక్షులకు ఆశ్రయం కలిగించే పార్టీ అని చంద్రబాబు చేసిన విమర్శలను ప్రధానంగా చేసుకుని చిరు మాటలు తూటాలుగా పేల్చారు. తమది వలసల పార్టీ కాదన్నారు. తెదేపా అధినేత నియంతృత్వ ధోరణిని సహించలేని వారు అక్కడ ఇమడ లేక తమ చెంతకు వస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నట్టు చిరు వివరణ ఇచ్చారు. అసలు.. చంద్రబాబే నిజమైన తొలి వలస పక్షి అని చిరు దయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు.. తెలుగుదేశంలోకి వలస పక్షిగా చేరలేదా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రాత్రికి రాత్రే దానం నాగేంద్రకు టిక్కెట్ ఇచ్చి వలసను ప్రోత్సహించలేదా? అని దెప్పిపొడిచారు. తాజాగా కాంగ్రెస్ నేత ముద్దుకృష్ణమ నాయుడిని తన పార్టీలో చేర్చుకోలేదా? అని చిరు విమర్శించారు. |