ప్రజారాజ్యం యువజన విభాగమైన యువరాజ్యం అదుపుతప్పుతోంది. యువరాజ్యం అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన తెలంగాణా పర్యటనలో చేసిన ప్రసంగాలు పీఆర్పీ నేతలనే ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీ అధినేత చిరంజీవి ఒకవైపు ఆచితూచి వ్యవహరిస్తుంటే, మరోవైపు "తమ్ముడు" పవన్ కల్యాణ్, పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీని ఆరంభంలోనే అప్రతిష్ట పాలు చేస్తున్నారు. దీంతో పార్టీలోని సీనియర్ నేతలతో సహా కింది స్థాయి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రజారాజ్యం, నవ తెలంగాణ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన వరంగల్ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గతంలో వరంగల్ విద్యార్ధినులపై యాసిడ్ దాడి చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేసిన వైనాన్ని పవన్ ప్రస్తావించారు. అలాగే ప్రజా ధనాన్ని దోచుకుతింటున్న నేతలను సైతం ఇలాగే ఎన్‌కౌంటర్ చేసి పారేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల అసలు రాజకీయ నాయకులపైనే ప్రజల్లో ఏవగింపు కలిగే పరిస్థితి ఏర్పడవచ్చని, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థలో రాజకీయనాయకులే ముఖ్యమన్న సంగతిని పవన్ విస్మరించినట్టుగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ నాయకులే అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రసంగాలు చేయాల్సి వుంటుందని ఆయన హితవు పలికారు. పొంతనలేని అన్నయ్య-తమ్ముడు ప్రకటనలు పార్టీ అధినేత చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలకు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. పార్టీ ప్రారంభోత్సవ సభలో ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని చిరంజీవి ప్రకటించగా పవన్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రసంగించారు. అలాగే రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడిన పవన్ తమ పార్టీలో కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారనే సంగతి మరచిపోయినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ చేసే వ్యాఖ్యలు ప్రతిపక్ష రాజకీయ నేతలు విమర్శించేందుకు మంచి అవకాశంగా ఉపయోగపడతాయని పీఆర్పీ శ్రేణులు అంటున్నారు. |