ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు లేదని తేలిపోయింది. తెలంగాణ ప్రాంతాల్లో తమ పార్టీకి ఉన్న పట్టు "వాపు మీద బలుపు"లాంటిదన్న నిజాన్ని గ్రహించే ఈయన ఒంటరి పోటీ ఊసెత్తడం లేదని స్థానికులు అంటున్నారు. అసలు ఆ మాట వింటేనే బెదిరిపోతున్నట్టు సమాచారం. అందుకే... ఇతర పార్టీలను శాసించాల్సిన కేసీఆర్.. ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. పీఆర్పీ, తెదేపా వేసే భిక్షం (సీట్లు) కోసం ఎదురు చూస్తూ, తెలంగాణా వాదాన్ని తుంగలో తొక్కుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఏ తెలంగాణ కోసమైతే.. తెదేపా నుంచి వీడి సొంతగా పార్టీని స్థాపించిన కేసీఆర్.. అసలు విషయాన్ని పక్కనబెట్టి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పావులు కదుపుతున్నారు. తెలంగాణా జిల్లాలన్నింటిలో కలిపి మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఈ సీట్ల ఫలితాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో.. ఈ ప్రాంతాల్లో తెరాసకు మంచి పట్టు ఉన్నట్టయితే సొంతగా పోటీ చేయవచ్చు. కానీ తెరాసకు పట్టులేదన్న విషయం తేలిపోయింది. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఇది తేటతెల్లమైంది. సాక్షాత్ అధినేత కేసీఆర్ గుడ్డిలోమెల్లగా ఓటమి కోరల నుంచి బయటపడి గెలిచారు. ఈ ఫలితాలు తెరాసకు తెలంగాణా ప్రాంతాల్లో ఏమాత్రం పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేశాయి. అందుకే.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని తెలుస్తోంది. ఫలితంగా... తమను ఏ పార్టీ గట్టెక్కిస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం అటు పీఆర్పీ, ఇటు తెదేపాతో దాగుడు మూతలు ఆడుతూ.. సీట్ల బేరమాడుతున్నారు. ఆ రెండు పార్టీల గేట్ల వద్ద తెరాస నేతలను పడిగాపులు కాయిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో తెరాసకు నిజమైన బలం, పట్టు ఉంటే తెరాస ఇతర పార్టీలను శాసించాల్సిన తరుణం. కానీ.. తద్విరుద్ధంగా తెరాసను శాసించే స్థాయిలో మిగిలిన పార్టీలు ఉన్నాయి. ఇందులో నిండుగా ఐదు నెలలు కూడా నిండని పీఆర్పీ కూడా ఉండటం గమనార్హం. ఫలితంగా.. ఆయా పార్టీ గడపల ఎదుట తెరాస నేతలను పడిగాపులు కాయించేలా చేస్తోంది. తెరాసకు నిజంగా తెరాస లక్ష్యసాధనే ధ్యేయమైతే.. ఒంటరిగా 119 స్థానాల్లో పోటీ చేసి, సంపూర్ణ విజయం సాధించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చు. కానీ.. ఒంటరిగా పోటీకి దిగితే తమ గుట్టు బట్టబయలు అవుతుందని తెరాస నేతలకు తెలుసు. అందుకే.. ఏ పార్టీ ఎక్కువ మొత్తంలో సీట్లు ఆఫర్ చేస్తుందో ఆ పార్టీ కోసం మోహం వాచిపోయేలా ఎదురు చూస్తు, రాజకీయాలను రక్తికట్టిస్తోంది. |