ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లను బుట్టలో వేసేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు స్థానిక సెలబ్రిటీలకు పిలుపినిస్తున్నాయి. జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన ప్రముఖులను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొందరి పేర్లను తెరపైకి తెచ్చాయి కూడా. అసలు సెలబ్రిటీల రాజకీయ రంగప్రవేశం మన రాష్ట్రంలోనే ఎక్కువగా కనబడుతోంది. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు చిరంజీవి అరంగేట్రంతో ఆయన కుటుంబంలోని నటులందరూ రాజకీయ బాట పట్టారు. ఎడాపెడా నిర్వహిస్తున్న రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పాలక, ప్రధాన ప్రతిపక్ష నేతల్లో గుబులు పుట్టినట్లయింది. చిరంజీవిని చూసేందుకు ప్రజలు వస్తున్నారని చెపుతూ వచ్చిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆ తారలకోసమే గాలాలు వేయడం మొదలుపెట్టాయి. అధికార పార్టీ కాంగ్రెస్... యువసామ్రాట్ అక్కినేని నాగార్జున వీడియో క్లిప్పింగ్‌ను ఈసరికే ప్రజల మధ్యకు విడుదల చేసేసింది. నటశేఖర కృష్ణ సైతం వైఎస్ పథకాలు సూపర్ అని పలు చోట్ల కితాబిచ్చారు. కృష్ణతోపాటు మహేశ్ బాబు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నట్లు మనం లెక్క వేసుకోవాలి. ఆపై చిరంజీవికి రాజకీయానుభవం లేదని ఆరోపణలు చేసిన రాజశేఖర్, జీవిత దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే వరుసలో జయసుధ... కవిత.. రాజా (ఆనంద్ ఫేం)... ఇలా చిన్నచిన్న నటులు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇక జాతీయ స్థాయి రాజకీయాలలో తనకు ప్రవేశం కల్పించాలని భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ స్వయంగా సోనియాగాంధీని కోరినట్టు సమాచారం. మరోవైపు తెలుగుదేశం తనకున్న తారాబలాన్ని రాజకీయ చదంరంగంపైకి తేవడానికి అష్టకష్టాలు పడింది. ఎట్టకేలకు చంద్రబాబు కృషి ఫలించినప్పటికీ.. తారకరత్న వంటి యువ హీరోలతో చిక్కులు తప్పలేదు. "బాబాయ్ బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది" అంటూ వ్యాఖ్యానించి చంద్రబాబు నిద్రలేని రాత్రులను మిగిల్చారు. దీంతో తెదేపాలో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. చివరికి బాలకృష్ణ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు తెలుగుదేశం శిబిరంలో బాలకృష్ణ, తారకరత్న, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, రోజా, బాబూమోహన్, ఇలా.. అనేక మంది ఉన్నారు. రోడ్ షోలతో మహా బిజీ బిజీగా ఉన్నారు. |