ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒకవైపు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌లు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన సాగిస్తున్నారు. అలాగే ఐదు రోజుల పాటు అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించి వచ్చిన బాలయ్య కూడా ఈనెల 16 నుంచి మలివిడత పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఆ కోవలోనే నందమూరి వారసులు విస్తృత ఎన్నికల ప్రచారానికి సిద్ధవుతున్నారు. మార్చి నెల నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనేందుకు సమ్మతించారు. ఈ మేరకు గత ఆదివారం తెదేపా, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. తాను మార్చి 12వ తేదీ నుంచి నిరాటంకంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు.
మరోవైపు కళ్యాణ్ రామ్‌లు కూడా ప్రచారాం చేసేందుకు సమ్మతించారు. మరో నందమూరి హీరో తారకత్న ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. మిగిలిన జిల్లాల్లో కూడా తాను పర్యటించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే బాలయ్య ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కొన్ని తెలంగాణా జిల్లాల్లో పర్యటించాలని యోచిస్తున్నారు.
తాను ఇటీవల రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినపుడు ప్రజలు తననెంతో ఆదరించారని, ప్రతీ రోడ్ షోకు అశేషంగా జనాలు వచ్చి తనను దీవించారని బాలయ్య చంద్రబాబుతో జరిగిన భేటీలో చెప్పారు. |