1. ఇతరాలు
  2. »
  3. కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్
  4. »
  5. కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009

ప్రత్యర్థుల బలంతో కేసీఆర్‌కు "ముచ్చెమటలు"

ఎన్నికలు రికార్డు విజయం తెరాస కేసీఆర్ కరీంనగర్ స్థానం ప్రజారాజ్యం భాజపా తెదేపా ఓట్లు వెలమ వర్గం
FileFILE
గత 2004 ఎన్నికల్లో రికార్డు విజయంతో గెలుపొందిన తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు ఈ సారి ఎన్నికలు ప్రాణసంకటంగా మారాయి. మహాకూటమి తరపున ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ స్థానం నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్న ఆయనకు.. ఈ దఫా విజయం అంత సులభంగా దక్కేలా లేదు. ఈ విషయం గత ఉప ఎన్నికల్లోనే తేటతెల్లమైంది.

రాజకీయంగా చైతన్యవంతమైన కరీంనగర్ స్థానం నుంచి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతన్నాయి. దీంతో కేసీఆర్ సైతం తన వ్యూహాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నియోజక వర్గంలో బీసీలు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నా.. ప్రధానంగా వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లే అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత మూడు సార్లుగా పోటీ చేసి గెలుపొందుతూ.. వచ్చిన ఆయన గత ఉప ఎన్నికల్లో "గుడ్డిలోమెల్ల" చందంగా ఓటమి కోరల నుంచి బయటపడ్డారు. 2004 ఎన్నికల్లో 2 లక్షల పైచిలుకు మెజారిటీ నుంచి కేవలం 15 వేలకు పడిపోయింది. దీంతో ఆయన ఈ సారి మెదక్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు పీఆర్పీలు గట్టి అభ్యర్థులపైనే దృష్టి సారించాయి.

గత ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు గట్టి పోటి ఇచ్చిన జీవన్‌రెడ్డిని ఈ సారి బరిలో దించి లాభపడాలని చూస్తోంది. జీవన్ రెడ్డి పోటీకి అంగీకరించని పక్షంలో వెలమ వర్గానికి చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు బరిలో దించాలని చూస్తోంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఇదే వర్గానికి చెందిన జిల్లా కన్వీనర్ వెలిచాల రాజేందర్‌ రావు పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం.

ఇక భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌ రావు మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈయన వేములవాడ శాసనసభ నుంచి పోటీ చేయాలని భావిస్తోన్నా కేసీఆర్‌కు ధీటైన అభ్యర్థి విద్యాసాగర్‌ రావేనని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇలా కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, భాజపా, పీఆర్పీలు అభ్యర్థుల ఎంపికలో వెలమలకే ప్రాధాన్యతను ఇస్తూ, కేసీఆర్‌కు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నాయి.
About Writer
PNR