కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణా రాష్ట్ర సమితి కలిసి మహాకూటమిగా రూపాంతరం చెందాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించే సంగతేమో కానీ మహాకూటమిలో రగులుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం ముదిరి పాకానపడి ఎవరి దోవ వారిదన్న చందంగా మారుతోంది.
ఎన్నికల జరుగక ముందే వాదులాడుకుంటున్న మహాకూటమి నేతలు ఎన్నికలైన తర్వాత ఎలా ప్రవర్తిస్తారోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలిసికట్టుగా కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తామన్న మహా నేతల ఐకమత్యం ఎలా ఉందో ఈ కీచులాటలు ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి.
తెరాసతో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుగుదేశం అంటుంటే, తాము ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెరాస అన్నట్లు సమాచారం. మొత్తమ్మీద అటు కాంగ్రెస్‌కు, ఇటు ప్రజారాజ్యం పార్టీకి మహాకూటమి నేతలు పదునైన విమర్శనా బాణాలు తామే అందించినట్లయింది.
తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల రచ్చ ఇలానే కొనసాగి చర్చలు విఫలమైతే ఎన్నికల్లో మహాకూటమికి ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పట్టువదలని విక్రమార్కులు కలిసి మహాకూటమిలో ఎంతకాలం కొనసాగగలరన్న అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చించుకోవడం కనబడుతోంది. |