నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఆ నాలుగు కుటుంబాలు శాసిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం, కార్యకర్తల అండదండలు, అంగ బలం పుష్కలంగా ఉన్న నేతలు కష్టానికే పరిమితం అవుతున్నారు. ఆ నాలుగు కుటుంబ రాజకీయాల ముందు వీరు ఏమాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది. ఈ నాలుగు కుటుంబాల్లో ఒకటి నేదురుమల్లి ఫ్యామిలీ. మరో రెండు కుటుంబాలు ఆనం, మేకపాటి వంశానికి చెందినవి. తాజాగా ఈ కుటుంబాల జాబితాలో పనబాక లక్ష్మి కుటుంబం వచ్చి చేరింది. కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఈ నాలుగు కుటుంబాలకు కలిపి మొత్తం ఎనిమిది సీట్లు దక్కాయి. నేదురుమల్లి కుటుంబంలో రాష్ట్ర మంత్రి రాజ్యలక్ష్మికి వెంకటగిరి సీటును కేటాయించారు. ఆమె భర్త జనార్ధన్ రెడ్డిని రాజ్యసభకు పంపుతున్నారు. ఆనం సోదరుల్లో ఒకరికి (వివేకానంద రెడ్డి) నెల్లూరు రూరల్, మరొకరి ఆత్మకూరు (రామ నారాయణ రెడ్డి)ను కేటాయించారు. ఇకపోతే మేకపాటి సోదరుల్లో ఒకరైన మేకపాటి చంద్రశేఖర రెడ్డికి ఉదయగిరి, మరో సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి నెల్లూరు లోక్‌సభ సీటును అప్పగించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా తన భర్తకు కూడా టిక్కెట్‌ను కేటాయించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో పీఆర్‌ఓగా పని చేస్తున్న ఆర్.కృష్ణయ్య గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. దీంతో ఈ కుటుంబాల నుంచి ఒకరు రాజ్యసభకు పోటీ చేస్తుండగా, ఇద్దరు లోక్‌సభకు మరో ఐదుగురు జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేయడం విశేషం. గత ఐదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శాసిస్తూ వచ్చారు. ఆయన హవా తగ్గిందనుకున్న సమయంలో ఆనం, మేకపాటి, పనబాక లక్ష్మి కుటుంబం తాజాగా తెరపైకి వచ్చాయి. దీంతో జిల్లా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన కాంగ్రెస్ నేతలు ఉన్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన సోదరులకు, భార్యాభర్తలకు టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పెరుగుతోంది. జిల్లాలో కుటుంబ రాజకీయం కొత్త కాకపోయినప్పటికీ మరే పార్టీలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు కొనసాగడం పట్ల ద్వితీయ శ్రేణి నేతల్లో అసహనం నెలకొని ఉంది. |