ఇదిలా ఉంటే చిచ్చర పిడుగులా ప్రజలలోకి దూసుకొచ్చిన మరో యువకెరటం జూనియర్ ఎన్టీఆర్. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపిన జూనియర్ ఎన్టీఆర్, తాత స్మృతులను ప్రజలలోకి చొప్పించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ కారు ప్రమాదానికి గురై పర్యటనలకు దూరం కావలసి వచ్చింది. అయితే జూనియర్ హవా మరింతగా ఊపందుకుని ప్రజలలో మరింత ప్రాచుర్యం లభిస్తే... తెలుగుదేశం పార్టీలో అతనికి కీలక పదవి ఇవ్వక తప్పదు. ఆ పరిస్థితే కనుక ఎదురైతే భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీ పగ్గాలకై పోరు నెలకొనక తప్పదని కొందరు రాజకీయ నిపుణులు జోస్యం చెపుతున్నారు. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి వంతు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన తమ్ముళ్లు పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తూనే ఉన్నారు. అయితే తెరవెనుక చిరు కుమారుడు రామ్ చరణ్ తేజ, తన తండ్రి స్థాపించిన ప్రజారాజ్యం విజయం కోసం తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందించి చిరంజీవికి అందజేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ పీఆర్పీకోసం పలు గీతాలను స్వయంగా గానం చేశారు. ఇక మిగిలిన పార్టీలలోని అగ్ర నేతల కొడుకులు, కూతుళ్లు త్వరలో తమ తల్లిదండ్రుల గెలుపుకోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా యువత ప్రత్యక్ష రాజకీయాలపై మక్కువ చూపడం అభినందించదగ్గ విషయం. |