రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ ముగిసిన కొంతసేపటికే తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ వేరుపడితే హైదరాబాద్‌లో ఆంధ్రవారికి చోటుండదని అక్కడ వారు విదేశీయులుగా మారిపోయే ప్రమాదముందని వైఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు రెండో విడత ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అన్నది సుస్పష్టం. అయితే వైఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే తొలివిడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ ముగిసిపోవడంతో ఇక తెలంగాణ వాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టేసి ఆంధ్రప్రాంతంలోని ఓటర్లకు గాలం వేసి రెండో విడత ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచించిన ఆ పార్టీకి వైఎస్ వ్యాఖ్యలతో ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వేరుపడితే ఆంధ్రవారికి తప్పక అన్యాయం జరుగుతుందంటూ వైఎస్ ఘంటాపథంగా చెప్పడంతో సదరు వ్యాఖ్యలను ఏ విధంగా ఖండించాలో తెలియక తలపట్టుకోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వంతైంది. దీనికితోడు తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినవేనని ఆయన చెబితే తప్పులేదు నేను అంటే మాత్రం తప్పు వచ్చిందా అంటూ వైఎస్ మరోసారి పెదవి విప్పడంతో ఈ అంశం రెండో విడత ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అదేసమయంలో తెలంగాణపై తాజాగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీని ఇరకాటంలో పెట్టడం ద్వారా వైఎస్ ఓరకంగా విజయం సాధించారనే చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తుతో లబ్ధి పొందిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని పక్కనపెట్టింది. అంతేకాదు తాజా ఎన్నికల సందర్భంగా తెలంగాణ అంశంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకుండానే ఆ అంశానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్న పాత వ్యాఖ్యలనే మరోసారి వల్లించి తొలివిడత ఎన్నికలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అదేసమయంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి తీరాలని తలచిన టీడీపీ మాత్రం ఇందుకోసం టీఆర్ఎస్‌తోపొత్తుకు సిద్ధమైంది. ఈ పొత్తుకోసం అంతకుముందువరకు సమైఖ్య రాష్ట్రానికే కట్టుపడిన టీడీపీ ప్రత్యేక తెలంగాణకు తాము సిద్ధమంటూ ప్రకటించింది. అంతేకాదు మహాకూటమి పేరుతో టీఆర్ఎస్, వామపక్షాలతో కూటమిని సైతం ఏర్పాటు చేసింది. అలాగే కేవలం పొత్తులతో మాత్రమే సరిపెట్టని టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో కనీవినీ ఎరుగని విధంగా నగదు బదిలీ పథకాన్ని చొప్పించింది. దీంతోపాటు తాము అధికారంలోకి వస్తే పేదలకు కలర్ టీవీలను సైతం ఇస్తామంటూ హామీ ఇచ్చింది. |