ఇలా పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా ఓట్లను కొల్లగొట్టడంతో పాటు టీఆర్ఎస్‌తో పొత్తుద్వారా తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, మేనిఫెస్టోలో జనాకర్షక పథకాలను ప్రకటించకపోవడంతో తొలివిడత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఓట్లు రాలేదన్న గుసగుసలు అక్కడక్కడా వినిపించాయి.
దీంతో రెండో విడత ఎన్నికల్లోనైనా సరే ఖచ్చితంగా లబ్ధి పొందాలని తలచారో ఏమో వైఎస్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రెండోవిడత ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు నిర్ణయించిన వైఎస్ తెలంగాణ అంశాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించారు. దీంతో ప్రత్యేక తెలంగాణకు సై అన్న టీడీపీ ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమల్లో తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ ఆరోపణలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతేకాదు నిజంగానే తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రవారి గతి ఏంటని ప్రజలు మరోసారి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైఎస్ ఊసరవెల్లి అని తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని టీడీపీ ఎన్ని ప్రత్యారోపణలు చేస్తున్నా లోలోపల మాత్రం ఆ పార్టీకి గుబులుగానే ఉంది. ఎందుకంటే ఓట్లు రాలుస్తుందనుకున్న నగదు బదిలీ పథకాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం అందరూ వైఎస్ వ్యాఖ్యలపైనే దృష్టి పెట్టడంతో రెండో విడత పోలింగ్‌లో ఓటరు ఎలా స్పందిస్తాడోనని టీడీపీ శ్రేణులు హైరానా పడుతున్నాయి.
ఎందుకంటే వైఎస్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తే ఆంధ్ర ఓటరు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ధైర్యం చేసి ఖండించినా దానివల్ల తెలంగాణలో అధనంగా లాభపడే అవకాశమూ ఎలాగులేదు. ఎందుకంటే తెలంగాణ ఓటరు నిర్ణయం ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. కాబట్టి మరో ఐదేళ్లపాటు తెలంగాణ ఓటరును మెప్పించాల్సిన అవసరం ఎలాగూలేదు.
అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలు చేయాల్సిందంతా ఆంధ్ర ఓటరును ప్రసన్నం చేసుకోవడమే. ఇలాంటి తరుణంలో ఆంధ్ర ఓటరును ఆకర్షించడానికి వైఎస్ చేసిన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు టీడీపీకి కంటకంగా మారుతుందా... కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చుతుందా... అన్న విషయం రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాతే తేలనుంది.
|