మనసును ప్రశాంతంగా ఉంచే సంగీతం అనేక రోగాలను నయం చేస్తుందని వింటుంటాం. అవును అది ముమ్మాటికీ నిజమేనంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. సంగీతం వినేవారి గుండె పనితీరు సక్రమంగా ఉంటున్నట్లుగా తమ పరిశోధనల్లో తేలిందని "పావియా యూనివర్సిటీ"కి చెందిన పరిశోధకులు వెల్లడించారు.ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ లూసియానో బెర్నార్డీ మాట్లాడుతూ... సంగీతం వినడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరగడంతో పాటు.. రక్తనాళాలు, ఊపిరితిత్తులు లయబద్ధంగా పనిచేస్తాయని.. దీంతో అనారోగ్యం దరిచేరదని పేర్కొన్నారు. దీంతో సంగీతానికి గుండె సంబంధ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టగల శక్తి ఉంటున్నట్లుగా తాము గుర్తించామన్నారు.తమ పరిశోధనల్లో భాగంగా, 24 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులను, సంగీత నేపథ్యంగల 12 మంది సింగర్లను, ఎలాంటి సంగీత నేపథ్యమూ లేని 12 మంది వ్యక్తులను ఎంపిక చేసుకుని.. వారికి రకరకాల సంగీతాన్ని హెడ్‌ఫోన్ల ద్వారా వినిపించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో శ్రావ్యమైన, సున్నితమైన సంగీతాన్ని విన్న వారిలో గుండె పనీతీరు సక్రమంగా ఉండటమేగాక, రక్తనాళాలు, ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించామని బెర్నార్డీ వివరించారు. అలాగే... ఇదే కాలంలో సంగీతం వినిపించని వ్యక్తుల గుండె వేగం తగ్గడమేగాక, రక్తపోటు కూడా తగ్గిందని, రక్తనాళాలు మరింతగా విస్తరించాయని బెర్నార్డీ వివరించారు. కాబట్టి... చక్కటి హాయినిచ్చే సంగీతం విన్నట్లయితే మందుల అవసరం రాకుండా, గుండెను పదిలంగా కాపాడుకోవచ్చునని ఆయన సూచించారు. |