ఒత్తిడి పారదోలి, మనసుకు ప్రశాంత చేకూర్చడంలో అభ్యంగన స్నానం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్నానాన్ని ఆచరించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. అలసట తీరి నూతన శక్తి లభిస్తుంది.
హాయిగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. తలకే కాకుండా శరీరానికి కూడా నూనె పట్టించి మర్ధన చేయడం వలన శరీరానికి చక్కని వ్యాయామం లభించి దేహపుష్టి కలుగుతుంది. వాతాన్ని హరించి, వాతానికి సంబంధించిన అనారోగ్యం రాకుండా చేస్తుంది. తైలమర్ధనం శరీరానికి చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా ఉంటుంది.
చర్మానికి నూనె పెట్టడం, నలుగు పెట్టుకుని స్నానం చేయడం వలన చర్మం నిగనిగలాడి కాంతివంతంగా ఉంటుంది. అభ్యంగన స్నానం వల్ల తలనొప్పి, కళ్ల మంటలు కంటి ఎరుపు తగ్గిపోతుంది. దేహంలో ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకలు ఊడకుండా, ఒత్తుగా పెరగడానికి ఎంతగానో దోహదపడుతుంది.
జీర్ణక్రియ చురుకుగా పనిచేసి ఆకలిని పెంచుతుంది. అభ్యంగన స్నానం చేయడం వల్ల నిస్సత్తువ సోమరితనం దూరమైన హుషారుగా ఉంటుంది. గోరువెచ్చని నీటితో చేస్తే అభ్యంగన స్నానం శిరోజాల ఆరోగ్యానికి మంచిది.