వేసవికాలంలో దొరికే పండ్లలో రారాజు మామిడిపండు. ఆ మాటకొస్తే అన్ని పండల్లోనూ దీన్నే రారాజుగా అనుకోవచ్చు. ఎందుకంటే, వంద గ్రాముల బరువుండే మామిడిలో 50 కేలరీల శక్తి ఉంటుంది. అంతేగాకుండా, దీంట్లో.. విటమిన్ సితో పాటు విటమిన్ బీ1, బీ2, బీ6లు కూడా ఎక్కువగా ఉంటాయి.మామిడి పళ్లలోని పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. మామిడి రక్తపోటును సైతం నియంత్రించగలదని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే వేడి చేస్తుందనే భయంతో మామిడిపండును దూరంగా పెట్టాల్సిన అవసరం లేదనీ... పండు తిన్న కాసేపటి తరువాత దానికి విరుగుడుగా కాస్తంత మజ్జిగ తాగితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.అలాగే... వేసవిలో ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి. మజ్జిగలో కాస్తంత అల్లం, కొత్తిమీర, కరివేపాకు కలిపి... దాన్నో కుండలో పోసి ఉంచి ఎన్నిసార్లయినా తాగవచ్చు. అదీగాక చల్లటి మజ్జిగలో కొంచెం ఉప్పు, పంచదార వేసుకుని తాగినట్లయితే, వేడి తగ్గుతుంది. అంతేగాకుండా, అతిదాహం తగ్గి కాళ్లూ, చేతులూ లాగడం లాంటివి కూడా తగ్గుతాయి. పుదీనా ఆకులను కడిగి మెత్తగా గ్రైండ్ చేసి, పెరుగులో కలపాలి. అందులో కొద్దిగా నీరు, ఉప్పు, కాస్తం చక్కెర వేసి లస్సీలాగా చిలికి తాగినా కూడా శరీరంలో వేడి బాగా తగ్గుతుంది.వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా... శరీరంలో వేడి మరీ ఎక్కువయినట్లు అనిపించినా, దప్పిక చాలా ఎక్కువగా ఉన్నా... చందనాసవం, ఉశీరాసవం, ద్రాక్షాసవం వంటివి చాలా బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఏదైనా ఆసవాన్ని 10 ఎంఎల్ తీసుకుని నీళ్లలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించే సమయంలో నిపుణుల సలహాలను, సూచనలను పాటించటం అన్నివిధాలా శ్రేయస్కరం అన్న సంగతి మరువవద్దు. |