డయాబెటిస్ ప్రమాదకర వ్యాధి కాకపోయినా శాశ్వత చికిత్స లేని వ్యాధుల జాబితాలో ఒకటయ్యింది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నూటికి 16 మంది యువకులు ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. అలాగే ప్రతి స్కూల్లో ఇద్దరు విద్యార్థులు ఈ వ్యాధికి గురవుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తోంది.
కుర్రాళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారు. షుగర్ వ్యాధిని పసిగట్టటం కోసం ఇరవై సంవత్సరాలు దాటినవారు కేవలం మంచినీళ్లు తప్ప మరే ఇతర ఆహారం తీసుకోకుండా ఉదయం పూట రెండు రకాల రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఉదయం ఏడు గంటలకు ఒక రక్త పరీక్ష తరువాత 75 గ్రాముల గ్లూకోజ్ కలిపిన నీళ్లు తాగిన రెండు గంటల తర్వాత మరో పరీక్ష చేయించుకోవాలి.
మొదటి పరీక్షలో గ్లూకోజ్ 110 నుండి 125 మిల్లీగ్రాముల మధ్య ఉన్నట్లయితే ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అనే లక్షణంగా గుర్తించాలి. తరువాత పరీక్షలో 140 నుంచి 200 మిల్లీ గ్రాములలోపు ఉన్నట్లయితే ఇంపైర్డ్ గ్లూకోజ్ టోలరెన్స్ అనే లక్షణంగా భావించాలి. ఇటువంటివారికి త్వరలోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని గ్రహించాలి.
ఇక 125- 250 మిల్లీగ్రాములుంటే వారు మూడు నెలలపాటు మందులు లేకుండా ఆహార నియమాలు పాటిస్తే వ్యాధిని నియంత్రించే వీలుంటుంది. 25 ఏళ్ల లోపు వారికొచ్చే మధుమేహ నివారణకు ప్రతిరోజూ రెండుసార్లు ఇన్సులిన్ పైనే ఆధారపడాలి.