వాసనకోసం కరివేపాకును కూరలో వేసుకుని తినేటప్పుడు దానిని తీసిపారేయడం తప్పు అన్న పెద్దల నానుడిని ఇప్పుడు వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు. అందుకే కరివేపాకులోని లాభాలేమిటో మనం తెలుసుకుందాం.
ఔషధంగా కరివేపాకు : కడుపులో వికారం, వాంతులు అవుతున్నపుడు... రెండు చెంచాల కరివేపాకు రసంలో ఓ చెంచా నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి పుచ్చుకుంటే తగ్గిపోతుంది. లేదా కరివేపాకును ముద్దగా నూరి, చెంచాడు ముద్దను గ్లాసుడు పల్చని మజ్జిగలో కలిసి తీసుకున్నా సమస్య తీరిపోతుంది. గర్భవతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కరివేపాకు ముద్దలో తేనెకలిపి తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి. 15 గ్రాముల కరివేపాకును గుజ్జుచేసి, రసంతీసి, గ్లాసుడు మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే జీర్ణాశయం సక్రమంగా పనిచేస్తుంది. శరీరం బరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది పదిహేను కరివేపాకులను నమిలి తినాలి. గాయాలమీద, కాలిన గాయాల మీద కరివేపాకు నూరి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి. కరివేపాకు కాయలనుంచి రసంతీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి.
సౌందర్య సాధనంగా కరివేపాకు : కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు వేయించండి. తర్వాత చల్లార్చి పెట్టుకోండి. ప్రతిరోజూ ఈ పొడిని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. కరివేపాకును పచ్చడిగానో... లేక విడిగానో తిన్నా, లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది.
|