ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1,60,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యుల నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయని టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇన్-చార్జి ప్రొఫెసర్ పూర్ణా కుర్‌కురె తెలిపారు. పైన పేర్కొన్న పిల్లలలో 80 శాతం మంది క్యాన్సర్ బాధిత పిల్లలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉన్నారని పూర్ణా అన్నారు.
పిల్లలలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంలో జరుగుతున్న జాప్యం సత్వర చికిత్సకు అవకాశం లేకుండా చేస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్యాన్సర్ నిపుణుల సదస్సు నవంబర్ ఒకటి నుంచి ముంబైలో ప్రారంభం కానున్నది. నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ) ప్రాంగణంలో జరిగే సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే చిన్నపిల్లల క్యాన్సర్ నిపుణులు తమ పరిశోధనా పత్రాలను సదస్సుకు సమర్పిస్తారు.
అక్టోబర్ 31న ఎన్‌సీపీఏ ప్రాంగణంలో గల జంషెడ్‌జీ బాబా థియేటర్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ ఎస్ఎం.కృష్ణ ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా తల వాపు, కంటిలో వైట్ గ్లో, తగ్గకుండా మరియు వైద్య పరిభాషకు అందని జ్వరం తదితర వ్యాధి లక్షణాలతో పిల్లలలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించవచ్చునని పూర్ణా వెల్లడించారు.
|