మీరు మధుమేహం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ఔషధ గుణాలు పుష్కలంగా గల నోని హెర్బల్ మొక్క తాలూకు ఉత్పత్తులను ఒక అలవాటుగా స్వీకరించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. భారతదేశపు మల్‌బర్రీగా పేరుగాంచిన నానీ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తూ నానీ యొక్క ప్రాధాన్యతను దేశప్రజలు గుర్తించడంలేదని శనివారం ఇక్కడ జరిగిన ఒక పత్రికా సమావేశంలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు.
నానీ యొక్క ఔషధగుణాలను, వ్యవసాయ లాభాల పట్ల ప్రజలలో సంపూర్ణ అవగాహనను కలిగించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రపంచ నోనీ పరిశోధన సంస్థ (డబ్ల్యూఎన్ఆర్ఎఫ్) ఛైర్మన్ కీర్తి సింగ్ తెలిపారు. మొక్కకు చెందిన వేర్లు, ఫలాలు, కాండము, ఆకులు మరియు బెరడులోని ఔషధగుణాలు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితర రోగకారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని అన్నారు.
అంతేకాక అల్లోపతి, ఆయుర్వేదం, మరియు హోమియోపతి వైద్యప్రక్రియలలో నోనీని వినియోగించి సత్ఫలితాలను రాబట్టవచ్చునని ఆయన స్పష్టం చేసారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కాంట్రాక్టు రైతులు నోనీ మొక్కను సాగు చేస్తున్నారని కీర్తి సింగ్ వెల్లడించారు. కేంద్రప్రభుత్వం నోనీ మొక్కను ఔషధ మరియు ఉద్యానవన మొక్కగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
|