మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఓ తీపి వార్త. అమూల్ బ్రాండ్‌గా వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న గుజరాత్ సహకార పాల ఉత్పత్తుల విక్రయ సమాఖ్య (జీసీఎమ్ఎమ్ఎఫ్) మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం చక్కెర రహిత మిఠాయిలను దేశవ్యాప్తంగా పరిచయం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
ఇటీవల తాము విడుదల చేసిన చక్కెర రహిత ఐస్ క్రీమ్‌లకు మంచి స్పందన రావడంతో చక్కెర రహిత మిఠాయిలకు జీసీఎమ్ఎమ్ఎఫ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మధుమేహ వ్యాధిగ్రస్థులతో పాటు ప్రతి ఒక్కరు మిఠాయిల పట్ల మక్కువ ప్రదర్శిస్తారని జీసీఎమ్ఎమ్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర రహిత మిఠాయిలను త్వరలో మార్కెట్‌లో విడుదల చేస్తామని వెల్లడించాయి.
35 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్థులతో ప్రపంచానికి మధుమేహ రాజధానిగా భారత్ అవతరించింది. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా దేశంలో మధుమేహ వ్యాధి గణనీయంగా పెరిగిపోతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పెరిగిపోతున్న మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యను సొమ్ము చేసుకునేందుకు త్వరితగతిన అమ్ముడుపోయే వినియోగదారు ఉత్పత్తులను (ఎఫ్ఎమ్‌సీజీ) తయారు చేసే కంపెనీలు చక్కెర రహిత ఉత్పత్తులపై తమ దృష్టిని కేంద్రీకరించాయి.
|